Sunday, November 12, 2006

నాయుడుపేటలో 12 టెక్స్‌టైల్ మిల్లులు

2006 నవంబర్ 09 : నెల్లూరుజిల్లా నాయుడుపేటలో రెండు భారీ టెక్స్‌టైల్‌పార్కులు ఏర్పాటు కాబోతున్నాయి.తమిళనాడుకి చెందిన 12 వస్త్ర కంపెనీల ఆధ్వర్యవంలో 12 మిల్లులు స్థాపించబోతున్నారు.ఈ మేరకు ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.ఆర్.సమక్షంలో గురువారం నాడు హైదరాబాదులో ఆయా కంపెనీల ప్రతినిధులు అవగాహన పత్రాల(MoU)పై సంతకాలు చేశారు.

ఈ పార్కుల్లో ఒకదాన్ని కోయంబత్తూరుకి చెందిన Southern India Mills' Association రూ.1400 కోట్ల పెట్టుబడితో 650 ఎకరాల్లో ఏర్పాటు చెయ్యబోతోంది.అందులో 11 వస్త్ర సంస్థలు తమ జౌళి మిల్లుల్ల్ని ప్రారంభిస్తాయి.చెన్నైకి చెందిన Loyola Textile Mills Limited కూడా రూ.100 కోట్ల పెట్టుబడితో 150 ఎకరాల్లో మరో పార్కు ఏర్పాటు చెయ్యబోతోంది.ఈ రెండు పార్కుల్లోను స్పిన్నింగు నేత మరియు రెడీమేడు దుస్తుల (apparels)తయారీ యూనిట్లు నెలకొని ఉంటాయి.

ఈ పార్కుల ఏర్పాటుతో 16 వేలమందికి ఉపాధి లభిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు.కాని తమిళనాడుకి చెందిన సంస్థలు ఆంధ్రా-తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన నాయుడుపేటనే ఎంచుకోవడం తమిళనాడువారికే లాభిస్తుంది గాని రాష్ట్రానికి ఒనగూడే ప్రయోజనమేదీ లేదనే వాదన కూడా వినిపిస్తోంది.ఉద్యోగుల్ని కూడా చెన్నై నుంచే దిగుమతి చేసుకునే అవకాశం ఉందని తెలుగువారికి అవకాశం ఇవ్వకపోవచ్చునని వారు హెచ్చరిస్తున్నారు.

విశాఖకి భారీ పెట్రో మండలి

2006 నవంబర్ 09 : Petroleum Chemicals and Petro-chemicals Investment Regions (PCPIRs) లో ఒకటి విశాఖపట్నానికి కేటాయిస్తూ కేంద్రం తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. విశాఖపట్నంతో పాటు మంగుళూరు (కర్నాటక)పారాదీప్ (ఒరిస్సా) హల్దియా (పశ్చిమ బెంగాల్) దహేజ్ (గుజరాత్) కుండ్లి పానిపట్ (హర్యానా) ముంబాయి/రత్నగిరి (మహారాష్ట్ర)లకి వీటిని మంజూరు చెయ్యడానికి రంగం సిద్ధమైంది. త్వరలోనే దీనికి సంబంధించిన ఆధికారిక ప్రకటన వెలువడబోతోంది.

ఈ పెట్రో మండళ్ళు ఒక్కొక్కటి 200 లేదా 250 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో నెలకొని ఉంటాయి.మన రాష్ట్రంలో విశాఖపట్నం నుంచి కాకినాడ దాకా ఉన్న ప్రాంతం దీని పరిధిలోకొస్తుంది. ముడి చమురు (crude oil)ని సహజవాయువు (natural gas)ని ముడిసరుకు (raw material) గా ఉపయోగించుకునే రిఫైనరీలు పెట్రో కెమికల్ క్రాకర్ యూనిట్లు మొత్తం 200 దాకా వివిధ దశల్లో ఏర్పాటవుతాయి.షుమారు 60 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని 40 వేల మందికి ఉద్యోగావకాశాలు ఉంటాయని అంచనా.ఇక్కడ ఏర్పాటయ్యే యూనిట్లకి 15 సంవత్సరాల పన్ను విరామం (tax holiday) ప్రకటించవచ్చునని అంతర్గత వర్గాల భోగట్టా.

ఈ ఏడాది జూన్ 20న ప్రధానమంత్రి డాక్టర్ మన్‌మోహన్‌సింగ్ విశాఖపట్నం వచ్చినప్పుడు విశాఖకి బృహత్ పారిశ్రామిక మండలాన్ని (mega industrial zone) మంజూరు చేస్తామని బహిరంగ సభలో హామీ ఇచ్చారు.

సుల్తాన్‌పూర్‌లో నోవార్టిస్ కేంద్రం

2006 నవంబర్ 09 : ప్రపంచంలో నాలుగో అతి పెద్ద ఔషధ కంపెనీ Novartis మెదక్ జిల్లా సుల్తాన్‌పూర్‌లో 150ఎకరాల్లో ఒక పెద్ద ఔషధ పరిశోధన ప్రాంగణాన్ని (research campus)ఏర్పాటు చెయ్యబోతోంది.అందులో వైద్య ఆరోగ్య సంబంధమైన సమాచార-సాంకేతిక సేవల(IT Services)పైపరిశోధనలు నిర్వహిస్తారు.ఈ మేరకు ఆ కంపెనీ గురువారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.ఆర్ సమక్షంలో రాష్ట్ర IT శాఖతో అవగాహన ఒప్పందం (MoU)కుదుర్చుకుంది.ఈ కార్యక్రమంలో ITమంత్రిణి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి ఉన్నతాధికారులు S.P.సింగ్ రత్నప్రభ HUDA వి.సి.జయేశ్‌రంజన్‌లతో పాటు నోవార్టిస్ ఎం.డి. శ్రీ రంజిత్ సహానీ పాల్గొన్నారు.150 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎకరా రూ.30 లక్షల చొప్పున కేటాయించడానికి ఈ సందర్భంగా అంగీకారం కుదిరింది.దీనికి ప్రత్యేక ఆర్థిక మండలం(SEZ)హోదా కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.షుమారు వెయ్యిమంది ITనిపుణుల్ని నియమించబోతున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.