Thursday, October 26, 2006

తెలుగు ఎడ్యుకేషనల్ కిట్ నేడే విడుదల

అల్పమాత్ర పఠన శక్తి గల విద్యార్థులలో తెలుగు పఠన అవగాహన నైపుణ్యాల్ని కేవలం 14 వారాలలోనే మెరుగుపరచేందుకు ఉద్దేశించిన ఒక ఎడ్యుకేషనల్ కిట్‌ని పబ్లిక్‌గార్డేన్సు (హైదరాబాదు)లోని జూబిలీహాల్లో ఈరోజు విడుదల చేస్తున్నారు. దీన్ని Christian Children's Fund-India (CCF-India)వారు అభివృద్ధి చేశారు.గతంలో తిరుపతిలో 500 మంది ప్రభుత్వ పాఠశాలా విద్యార్థులపై చేసిన ఒక సర్వేలో వారికి అతి ప్రాథమికమైన పఠన అవగాహన నైపుణ్యాలు (reading and comprehension skills)గాని మౌలికమైన లెక్కల పరిజ్ఞానం గాని లేవని బయటపడ్డమే ఈ ఎడ్యుకేషనల్ కిట్ సృష్టికి ప్రేరణ.దీనికి వారు "పఠన నైపుణ్య మెరుగుదల కార్యక్రమం" (Reading skill improvement programme) అని పేరుపెట్టారు.

ముందు ఈ కిట్‌ని ప్రయోగాత్మకంగా జంటనగరాల్లోని 300మంది ప్రభుత్వ పాఠశాలా విద్యార్థుల వినియోగంలోకి తెస్తారు.తరువాత దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాలా విద్యాశాఖ సహకారంతో రాష్ట్రమంతటా వినియోగంలోకి తెస్తారు.ఈ కిట్‌లో ప్రధానంగా ఒక User Manualమరియు నూట తొంభయ్యొక్క Reading skill improvement Cards ఉంటాయి.దీన్ని రూపొందించడంలో District Institute of Education and Training కి చెందిన అధ్యాపకులు మరియు ఉపాధ్యాయులు ప్రముఖపాత్ర పోషించారు.

పూర్తి కావస్తున్న విద్యుత్‌కేంద్రాల నిర్మాణం

2006 అక్టోబర్ 26 : రాయలసీమ థెర్మల్ పవర్ స్టేషన్ (RTPS) యొక్క విస్తరణ ప్రాజెక్టులోని 210 మెగావాట్ల తొలి యూనిట్టు వచ్చే నెల నుంచి పని చెయ్యడం ప్రారంభిస్తుంది. రెండో యూనిట్టు (210 మెగావాట్లు) 2007 ఫిబ్రవరి నుంచి పనిచేస్తుంది.ముఖ్యమంత్రి డా.వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఈ మేరకు జెన్‌కో ట్రాన్స్‌కో అధికారులకి ఆదేశాలు జారీ చేశారు.
విజయవాడ థెర్మల్ పవర్ స్టేషన్ (VTPS)కి చెందిన 500 మెగావాట్ల నాలుగో యూనిట్టుని 2008 ఆగస్టు నాటికల్లా సిద్ధంగా ఉంచాలని ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించారు.

2,100 మెగావాట్ల కరీంనగర్ గ్యాస్ పవర్ ప్లాంటుకి చెందిన తొలి దశని 2009 మార్చి నాటికి ; అలాగే రెండో దశని 2009 సెప్టెంబరు నాటికి ; మూడో దశని 2010 మే నాటికి పూర్తి చేయ్యాలని కూడా ఆదేశించడం జరిగింది.

ఏడో నెంబరు జాతీయ రహదారి వెడల్పుసేత నేడే ప్రారంభం

2006 అక్టోబరు 26 : హైదరాబాదు నుంచి నాగపూరు (మహారాష్ట్ర)కి బెంగుళూరికి దారితీసే ఏడో నెంబరు జాతీయ రహదారిని నాలుగు వరసల మార్గంగా మార్చడానికి ఉద్దేశించిన ప్రాజెక్టుకి ఈరోజు భారత ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్‌సింగ్ శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి డా.వై.ఎస్.రాజశేఖరరెడ్డితో పాటు ఓడల రవాణా రోడ్డురవాణా మరియు రహదారిశాఖల యూనియన్‌మంత్రి శ్రీ టి.ఆర్.బాలు మరియు పట్టణాభివృద్ధి శాఖ యూనియన్ మంత్రి శ్రీ S.జైపాల్‌రెడ్డి మొదలైనవారు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం కొత్తకోట పట్టణం శివార్లలో జరిగింది.

నీటి పారుదలకి ప్రపంచ బ్యాంకు ఋణం

2006 అక్టోబర్ 26 : నాగార్జునసాగర్ కాలువల్ని ఆధునీకరించడం కోసం అలాగే పలు చిన్న తరహా ఆనకట్టలు నిర్మించడం కోసం ప్రపంచ బ్యాంకు మన రాష్ట్రానికి రూ.3,200కోట్ల ఋణాన్ని ఇవ్వడానికి అంగీకరించిందని చిన్న తరహా నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ పొన్నాల లక్ష్మయ్య నిన్న ప్రకటించారు.అందులో రూ.2000కోట్లు నాగార్జునసాగర్ కాలువల ఆధునీకరణకే వ్యయమౌతుంది.ఈ ఋణానికి సంబంధించి షరతులేవీ లేవని ఆయన చెప్పారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఋణభారం రూ.86,000కోట్లు దాటి పోయింది.అంటే తలసరి ప్రతి పౌరుడి మీదా ఉన్న ఋణభారం రూ.9,316.రాష్ట్రంలో కాంగ్రెస్‌ప్రభుత్వం పగ్గాలుచేపట్టే (2004)నాటికి అది సుమారు రూ.58,000కోట్ల వద్ద ఉండేది.

కృష్ణపట్నానికి మరో రెండు విద్యుత్‌కేంద్రాలు

2006 అక్టోబరు 24 : నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఒక్కొక్కటి 600 మెగావాట్ల సామర్థ్యం గల రెండు విద్యుదుత్పత్తి కేంద్రాల్ని స్థాపించనున్నట్లు సర్వేపల్లి (నెల్లూరు జిల్లా)MLA మరియు మాజీ మంత్రి శ్రీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.వీటి స్థాపనకి రూ.2000కోట్లు ఖర్చుపెట్టనున్నారు. ఇప్పటికే రూ.15,000 కోట్ల వ్యయంతో నిర్మాణమవుతున్న 4,000 మెగావాట్ల కృష్ణపట్నం థెర్మల్ పవర్‌ప్లాంటుకి ఈ రెండూ అదనం. ఇవి పూర్తయితే మరో 600 మెగావాట్ల విద్యుత్‌కేంద్రం కూడా కృష్ణపట్నంలోనే ఏర్పాటయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు.అప్పుడు కృష్ణపట్నం కర్మాగారాల స్థాపిత శక్తి (installed capacity) 5,800 మెగావాట్లకి చేరుకోగలదు.వీటిల్లో ఒక్కొక్క చిరు (mini) కర్మాగారానికి 500 ఎకరాల స్థలం అవసరమని ప్రభాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.ఈ కొత్త కర్మాగారాల నిమిత్తం ప్రస్తుతం అయిదో నెంబరు జాతీయ రహదారినీ కృష్ణపట్నం పోర్టుని అనుసంధానం చేస్తున్న రెండు వరసల (two-lane) రోడ్డుని 2007 మధ్య నాటికి నాలుగు వరసల రోడ్డు స్థాయికి పెంచడం (upgradation) పూర్తవుతుందని ఆయన చెప్పారు.అలాగే కృష్ణపట్నం పోర్టు నుంచి వెంకటాచలం దాకా రైలుమార్గం వేస్తారని కూడా తెలుస్తోంది.ఈ అభివృద్ధి చర్యలతో కృష్ణపట్నం విశాఖపట్నమంతటి మహారేవునగరంగా అవతరించబోతోంది.కృష్ణపట్నం అభివృద్ధి ప్రాజెక్టుల కోసం అన్ని దేశాల కార్పొరేట్ దిగ్గజాలూ అహమహమికతో పోటీపడుతున్నాయి.పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ కాంట్రాక్టుల విషయాలు చూసుకుంటోంది.

Wednesday, October 25, 2006

అదనపు విమానాశ్రయాలు

2006 అక్టోబర్ 25 : నెల్లూరు, తాడేపల్లిగూడెం నగరాలలో కూడా రెండు చిన్న విమానాశ్రయాల్ని నిర్మించడానికి సంబంధించి నిన్నటి క్యాబినెట్ సమావేశంలో చర్చించినట్లు ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పత్రికావిలేఖరులతో అన్నారు.

Sunday, October 22, 2006

దేశంలోనే మూడో సంపన్న నగరం హైదరాబాద్

పన్ను వసూళ్ళలో ముంబాయి, కొత్తఢిల్లీల తరువాత మూడో స్థానంలో హైదరాబాదే ఉందని ఆదాయం పన్ను శాఖ ఛీఫ్ కమీషనర్ శ్రీ డి.వి.ధార్మిక్ వెల్లడించారు.రూ.5లక్షల కంటే ఎక్కువ విలువ గల ఆస్తుల రిజిస్ట్రేషన్లు గత ఆర్నెల్లలోనే 86వేలు జరిగాయి.ప్రస్తుత ఆర్థికసంవత్సరంలో మొదటి ఆర్నెల్లలోనే రూ.3,681కోట్ల ఆదాయం పన్ను వసూలయింది.గత ఏడాది ఇదే సమయంలో జరిగిన పన్ను వసూళ్ళతో పోలిస్తే ఇది 59శాతం అధికం.సినీరంగం నుంచి కూడా 50శాతం ఎక్కువ పన్ను వసూలయినట్లు చెప్పారు.

పదేళ్ళ క్రితం రాష్ట్రం మొత్తం మీద ఏడాదికి వెయ్యికోట్ల ఆదాయం పన్ను వసూలు కావడమే గగనంగా ఉండేది.అలాంటిది ఇప్పుడు ఒక్క హైదరాబాదులోనే కొన్ని వేలకోట్లు ఆర్నెల్ల వ్యవధిలో వసూలవ్వడం పరిశీలకుల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతోంది.రాష్ట్రం అప్రతిహతంగా ముందుకు సాగుతోందనడానికి ఇది నిదర్శనమని కాంగ్రెస్‌వారు భావిస్తున్నారు.కాగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు డబ్బు మూటగట్టుకున్నంత మాత్రాన రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదని తెలుగుదేశం, సి.పి.ఐ..(ఎం)లు భావిస్తున్నాయి.

భారీ అంతర్జాతీయ విమానాశ్రయంగా అవతరించబోతున్న శమ్షాబాద్
శమ్షాబాదులో నిర్మిస్తున్న హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కోటీ 20లక్షల మంది ప్రయాణీకుల రాకపోకలకి అనువుగా సదుపాయాలు కల్పించాలని GMR Hyderabad International Airport Limited నిర్ణయించింది.2008మార్చిలో విమానాశ్రయం మొదటి దశ పూర్తయ్యే నాటికి ఇందుకోసం ఏర్పాట్లు చెయ్యాలని కంపెనీ భావిస్తోంది. విమానాల పార్కింగ్‌బే లని గతంలో అనుకున్న 30 సంఖ్య నుంచి 42కి పెంచబోతున్నట్లూ రెండు Rapid Exit Taxi Way లని ఏర్పాటు చేస్తున్నట్లూ వెల్లడించింది.అదనపు వసతుల కోసం రూ.529 కోట్లు పెట్టుబడి పెట్టాలని GMR-HIAL ప్రతిపాదించింది.ఈ మొత్తాన్ని బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకుంటారు.దీంతో కలిపి మొత్తం పెట్టుబడి రూ.2,283కోట్లు దాటుతుంది.మొదట 50లక్షల మంది ప్రయణీకుల్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని పనులు ప్రారంభించారు.తరువాత పెరిగిన రద్దీతో అంచనాలు 70లక్షలకి పెంచారు.వార్షిక వృద్ధి రేటు 40శాతం దాకా ఉండడంతో ఎప్పటికప్పుడు అంచనాల్ని పునస్సమీక్షించుకోవాల్సి వస్తోంది.భారీ సంఖ్యలో ఆంధ్రులు అమెరికాకి గల్ఫ్ దేశాలకి తరలి వెళుతూండడం ఈ పరిస్థితికి ఒక కారణమని హైదరాబాదు విమానాశ్రయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.ఇప్పుడే ఇలా ఉంటే 2008నాటికి హైదరాబాదులో పూర్తి స్థాయిలో అమెరికన్ కాన్సులేట్ ఏర్పడ్డాక పరిస్థితి అనూహ్యంగా ఉంది.

ఇక విశాఖ-కాకినాడల మధ్య సందడే సందడి

కాకినాడ రేవు నుంచి విశాఖ జిల్లా గంగవరం రేవు దాకా రూ.225 కోట్ల అంచనా వ్యయంతో కోస్తా రహదారి నిర్మించడానికి ప్రణాళిక రూపొందుతోంది.దీనికి సంబంధించిన ప్రతిపాదనల్ని రోడ్లూ-భవనాల శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించింది. పలు భారీ వాహనాల రద్దీతో విశాఖ-చెన్నైల్ని కలిపే అయిదో నెంబరు జాతీయ రహదారిపై విపరీతమైన ఒత్తిడి ఏర్పడుతోంది.దీనితో ఆ ప్రాంతంలోని పరిశ్రమలకి సరుకుల రవాణాలో జాప్యంతో పాటు ఖర్చులూ పెరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో NH-5కి ప్రత్యామ్నాయంగా కాకినాడ-గంగవరం రేవుల్ని కలిపే రహదారి ప్రతిపాదన ముందుకొచ్చింది.

సముద్రతీరం వెంబడి రోడ్డు సౌకర్యం ఏర్పడితే పెద్దయెత్తున సముద్రాధారిత పరిశ్రమలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

పెరిగిన తలసరి ఆదాయం (Per Capita Income)

2004-05లో రాష్ట్ర తలసరి ఆదాయం 23,807 రూపాయలుగా ఉందని అర్థ గణాంకాల శాఖ వెల్లడించింది.ఈ వివరాల్ని అర్థ గణాంక శాఖ డైరెక్టర్ సరోజా రామారావు 2006అక్టోబరు 17వ తేదీన విడుదల చేశారు.అంటే ఒక్కో వ్యక్తి ఆదాయం నెలకి సగటున దాదాపు రెండువేల రూపాయలు.రాష్ట్రంలో వివిధ రంగాల ఆదాయాల్ని స్థూల ఉత్పత్తిని తలసరి ఆదాయాన్ని గణించడానికి ఇప్పటిదాకా 1993-94ఆధార సంవత్సరంగా ఉంది.దీన్ని ప్రస్తుతం 1999-2000కి మార్చారు.

2004-05లో స్థూల ఉత్పత్తి రూ.2,02,576 కోట్ల నుంచి 3.08 శాతం వృద్ధి చెంది రూ.2,08,818 కోట్లకి చేరింది. కొన్ని రంగాల ఆదాయం పెరగ్గా మరికొన్ని రంగాల ఆదాయం తగ్గింది.వ్యావసాయిక ఆదాయం తరుగుదల చూపగా రియల్ఎస్టేట్ ఆదాయం భారీగా పెరిగింది.ప్రజలు వ్యావసాయిక సంస్కృతి నుంచి పారిశ్రామిక సంస్కృతికి మళ్ళే క్రమంలో వ్యవసాయం వాటా తగ్గి ఇతర రంగాల వాటా పెరగడం అత్యంత సహజమని ఇందులో ఆందోళనపడాల్సిందేమీ లేదని కొందరు ఆర్థికశాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

సవరణ

కడపలో జరగబోతున్నది క్రొత్త విమానాశ్రయం ఏర్పాటు కాదు.ఉన్న విమానాశ్రయాన్ని మెరుగుపరచి విస్తరించడం మాత్రమే.ఈ విషయాన్ని గుర్తుచేసిన త్రివిక్రం గారికి కృతజ్ఞతలు.

రాష్ట్రంలో మరో మూడు విమానాశ్రయాలు

కడప, నిజామాబాదు, ఆదిలాబాదు పట్టణాలలో క్రొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.రాజశేఖరరెడ్డి అన్నారు.తనతో ప్రత్యేకంగా సమావేశమైన ఎయిర్‌డెక్కన్ విమానయాన సంస్థకి చెందిన ప్రతినిధులతో చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి ఈ విషయం వెల్లడించారు.

అంతకుముందొకసారి రాష్ట్ర ప్రభుత్వం అయిదు చోట్ల క్రొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.అనంతరం ఎయిర్‌డెక్కన్ ప్రతినిధులు పత్రికల వారితో మాట్లాడుతూ విమానయానాన్ని ఇంతకుముందు ఆ సౌకర్యం లేని పట్టణాలకి విస్తరించడమే తమ ఉద్దేశమని విమానాశ్రయాల నిర్మాణంలో భాగస్వామ్యం వహించే ఉద్దేశం లేదని తెలియజేశారు.

పై ప్రతిపాదనలు సాకారమైతే రాష్ట్రంలోని విమానాశ్రయాల సంఖ్య 9(తొమ్మిది)కి చేరుకుంటుంది.

SEZ ల ద్వారా 4.70 లక్షల మందికి ఉపాధి

రాష్ట్రంలో ఏర్పాటు చెయ్యనున్న 48 ప్రత్యేక ఆర్థిక మండళ్ళ (Special Economic Zones) ద్వారా 4 లక్షల 70 వేల మందికి ఉపాధి లభిస్తుందని ఆంధ్ర ముఖ్యమంత్రి డా.వై.ఎస్.రాజశేఖరరెడ్డి తెలిపారు.ఈ మేరకు ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

IT మరియు IT ఆధారిత సేవల రంగంలోనే 2 లక్షల 35 వేల ఉద్యోగావకాశాలు ఏర్పడబోతున్నాయి.ఈ రంగాలకై 27 SEZ లు, తోలు మరియు పాదరక్షల రంగంలో 3, బయోటెక్నాలజీ, రెడీమేడ్ దుస్తులు, నిర్మాణ సంబంధ ఉత్పత్తులు, కాగితం, వస్త్రాలు, సెమికండక్టర్, బంగారు రత్న వజ్రాభరణాలు- ఈ రంగాలకి ఒక్కొక్కటి చొప్పున SEZ లను కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.వీటికి ప్రభుత్వభూములనే కేటాయించడం జరిగింది.విశాఖపట్నంలో HPCL మరియు కాకినాడలో ONGC కోసం ఏర్పాటు కాబోతున్న SEZ లకు ప్రభుత్వం బంజరు భూములని సేకరించి అందుబాటులో ఉంచుతుంది.సారవంతమైన పంటభూములను కేటాయించడం జరగదు.

కాకినాడని ముంచెత్తుతున్న పెట్టుబడుల వరద


ఆంధ్రదేశానికి రెండో మహా రేవుపట్టణమైన కాకినాడ పారిశ్రామికంగా శరవేగంగా పరుగులు తీస్తోంది. ప్రస్తుతం గోదావరీ ఫెర్టిలైజర్స్, నాగార్జునా ఫెర్టిలైజర్స్ లాంటి దిగ్గజాలకి నిలయమైన కాకినాడలో 2006-07 కాలంలో 12,000 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు స్థాపించడానికి అనేక దేశీ విదేశీ సంస్థలు ఆంధ్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందడానికి క్యూలో నిలబడుతున్నాయి.కొత్త పరిశ్రమల ఏర్పాటుతో ప్రత్యక్షంగా 15,000 మందికి పరోక్షంగా 50,000 మందికి ఉపాధి లభిస్తుంది.కాకినాడ-సామర్లకోట మధ్య ఉన్న 15 కిలోమీటర్ల రహదారి ఇప్పటికే పెక్కు పరిశ్రమలతో నిండి ఉంది. పై ప్రతిపాదనలు ఆచరణలోకి వస్తే ఈ రెండు పట్టణాలూ ఏకమై ఒకే మహానగరంగా రూపొందే అవకాశం ఉంది. 4.5 లక్షల జనాభా గల కాకినాడ నగరం ఇంతకు పూర్వమే మునిసిపల్ కార్పోరేషన్ హోదా పొంది ఉన్నది. పై పరిశ్రమలు కాక ఇంకో 600 ఎకరాలలో కాకినాడ స్పెషల్ ఇకనామిక్ జోన్ ఏర్పాటుకు కూడా కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించింది. ఈ SEZ కాకినాడని గుంటూరుతో సమానమైన ఎగుమతి కేంద్రంగా మార్చివెయ్యగలదు.

తిరుపతిలో మరో వైద్యకళాశాల

SVIMS (Sri Venkateswara Institute of Medical Sciences, Tirupati) మరియు కంచి కామకోటి పీఠం ఆధ్వర్యవంలో తిరుపతిలో వైద్యకళాశాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.రాజశేఖరరెడ్డి అధ్యక్షతన 2006 అక్టోబరు 19న హైదరాబాదులో జరిగిన SVIMS పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కంచిపీఠం ఆధ్వర్యవంలో ప్రస్తుతం కర్ణాటకలో శంకర నేత్రాలయ బాగా పనిచేస్తోందని రాష్ట్రంలో సైతం వైద్యసేవలు అందించడానికి ఆ పీఠం ముందుకొచ్చిందని ఆంధ్ర అధికారులు వివరించారు.ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం ప్రాతిపదికన రేణిగుంట విమానాశ్రయం దగ్గర వైద్యకళాశాల మరియు బోధనాస్పత్రి నిర్మిస్తారు.

Tuesday, October 03, 2006

Telugu-Andhra

మన రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ధి చెందాలని కోరుకునే వారిలో నేను కూడా ఒకణ్ణి.ఎప్పుడు ఏ దినపత్రిక తెరిచినా అందులో అబివృద్ధికి సంబంధించిన వార్తలేమైనా ఉన్నాయా ?లేదా ?అని వెయ్యి కళ్ళతో వెతుకుతాను.నా దృష్టిలో అంతకంటే ముఖ్యమైన విషయమేదీ లేదు.కాని మన పత్రికలవారు రాజకీయ నాయకుల చెత్త ఉద్ఘాటనలన్నీ మొదటి పుటల్లో అచ్చేసి అభివృద్ధి వార్తలకి మాత్రం చివరి పుటలు కేటాయిస్తారు.ఈ పరిస్థితి మారాలి.తెలుగు బ్లాగుల్లో అభివృద్ధికి సంబంధించిన బ్లాగులేమైనా ఉన్నాయా ?అని వెతికాను.ఏమీ కనిపించలేదు.అందుకని నేనే ఒకటి మొదలుపెడుతున్నాను.నా దృష్టికి వచ్చిన అభివృద్ధి వార్తల్ని మీతో పంచుకుంటాను.