హీరో శ్రీధర్ అస్తమయం
గత దశాబ్దాలకు చెందిన తెలుగు హీరో శ్రీధర్ నిన్న హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో కార్డియాక్ అరెస్ట్ మూలంగా కన్నుమూశారు.ఆయన వయస్సు 68 సంవత్సరాలు.అయితే ఆయన గత కొద్దికాలంగా అస్వస్థులుగానే ఉన్నారని తెలియవస్తోంది.ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో పాత తెలుగు సినిమాల అభిమానుల మధ్య సంతాపంతో కూడిన SMS లూ, ఈమెయిళ్ళూ ఊపందుకున్నాయి.
శ్రీధర్ "తల్లా ? పెళ్ళామా"సినిమాతో రంగప్రవేశం చేసారు.1975 లో"ముత్యాల ముగ్గు"సినిమాతో హీరో అయ్యారు.ఎనిమిదో దశకంలో అనేక క్యారెక్టర్ పాత్రలు కూడా ధరించారు.అయితే ఒక తేడా ఉంది.శ్రీధర్ సినిమా వేషాల కోసం ఎప్పుడూ తాపత్రయపడేవారు కారు.ఎవ్వరి సిఫార్సుల కోసమూ ఆశించేవారు కారు.ఎవరైనా తన దగ్గరకొచ్చి అడిగితే సరే ననేవారు.కాని తీసుకున్న ప్రతి పాత్రకూ న్యాయం చేశారు.అందుచేత ఆయనకు సినిమా రంగంలో గాడ్‌ఫాదర్స్ ఎవరూ లేరు.మొత్తం స్వయంకృషితోనే తన కెరీర్‌ని నిర్మించుకున్నారు.
ఆయన అంత్యక్రియలు ఈపాటికి ఆయన స్వస్థలమైన కొమ్ములూరు (కృష్ణా జిల్లా) లో ముగిసి ఉంటాయి.150 కన్నా ఎక్కువ సినిమాల్లో నటించిన ఆ మహానటుడి ఆత్మ శాశ్వతంగా మన నుండి సెలవు తీసుకుంది.ఆయనకు మన హృదయపూర్వక శ్రద్ధాంజలి.